
ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోండి: సీఎంకి.. కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)తో తక్షణమే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో కిషన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంట్ ఆధునిక సాంకేతికతతో తక్కువ ధరకే విద్యుత్తును ఉత్పత్తి చేస్తోందని, ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇతర దక్షిణ రాష్ట్రాలు ఇప్పటికే ఎన్టీపీసీతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
మార్చి 3న తెలంగాణలో 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని ఆయన వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రానికి విద్యుత్ అవసరం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. 2047 నాటికి తెలంగాణకు లక్ష మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం ఉండవచ్చని ఆయన పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రామగుండంలో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, మొదటి దశలో భాగంగా సుమారు రూ.12,000 కోట్ల వ్యయంతో అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించిన 2×800 మెగావాట్ల (మొత్తం 1,600 మెగావాట్లు) యూనిట్లను 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఇప్పటికే రెండో దశలో భాగంగా 3×800 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని. మొదటి దశలోలాగే రెండో దశలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సుమారు 85 శాతం తెలంగాణకే సరఫరా చేయనుందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 5×800 మెగావాట్ల మొత్తం సామర్థ్యానికి అవసరమైన బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కూడా కోరారు. దీంతో నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకు రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
