
‘ఎయిర్ ఇండియా’ ప్రమాదం..త్వరలోనే నివేదిక సమర్పిస్తాం: రామ్మోహన్ నాయుడు
గత ఏడాది జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న విచారణ తుది దశకు చేరుకుందని దర్యాప్తు నివేదికను అతి త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు అదనపు ప్రశ్నలకు ఆయన వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా కుప్పకూలిన ఎయిర్ ఇండియా (ఏI171) విమాన ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వేగంగా దర్యాప్తు చేస్తోందని ఈ ఏడాది చివరి లోపు నివేదిక వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇక పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తెలిపారు. గత వారం రోజుల్లోనే వివిధ ఎయిర్‌లైన్స్ సహకారంతో సుమారు 90 వేల మందిని భారతదేశానికి తీసుకువచ్చామని వెల్లడించారు. విమాన సర్వీసులను సురక్షితంగా నిర్వహించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిరంతరం ఎయిర్‌లైన్స్‌తో సమీక్షలు నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాల్లో 100 శాతం భద్రతా ప్రమాణాలు పాటించేలా కఠిన మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. అదేవిధంగా ప్రయాణికులకు ఎటువంటి గందరగోళం కలగకుండా ఎప్పటికప్పుడు ట్రావెల్ అడ్వైజరీలను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.
దేశీయ విమానయాన రంగం అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో పౌర విమానయాన రంగాన్ని కీలక ప్రాధాన్యత కలిగిన రంగంగా గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకువచ్చి మొత్తం విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. రాబోయే 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా మరో 200 విమానాశ్రయాలను నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ 5 లక్షల మంది దేశీయ ప్రయాణికులు మరో లక్ష నుంచి 2 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని మంత్రి గణాంకాలను సభ ముందుంచారు.
విమాన భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా ‘ట్రాక్ బై టెయిల్’ అనే డిజిటల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ద్వంద్వ ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం సాధారణ విమానాలే కాకుండా దేశంలో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించడం హెలికాప్టర్ సేవల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
