Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
‘కరూర్’ కేసులో విజయ్‌కు సీబీఐ నుంచి మళ్లీ పిలుపు

‘కరూర్’ కేసులో విజయ్‌కు సీబీఐ నుంచి మళ్లీ పిలుపు

Pinjari Chand
9 మార్చి, 2026

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) విచారణకు హాజరుకావాలని విజయ్‌కు మళ్లీ నోటీసులు పంపింది.. ఈ నేపథ్యంలో నటుడు-రాజకీయ నాయకుడు అయిన విజయ్ ఇప్పటికే ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈ దర్యాప్తులో ప్రధానంగా ఆ రోజు జరిగిన ఘటనల క్రమం, ప్రమాదం ఎలా చోటుచేసుకుందనే అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.

గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో తమిళ వెట్రి కళగం(టీవీకే) నాయకుడు విజయ్ నిర్వహించిన ప్రజా కార్యక్రమం సందర్భంగా భారీగా చేరుకున్న జనసందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది అక్టోబరులో ఈ కేసు దర్యాప్తును తమిళనాడు పోలీసుల నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది.

వేగంగా విచారణ

ఈ కేసు దర్యాప్తులో భాగంగా గత జనవరిలో కరూర్ సీబీఐ కార్యాలయంలో భద్రతా బాధ్యతలు నిర్వహించిన తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార కార్యక్రమం జరిగిన సమయంలో వారి డ్యూటీ సమయం, నియామక స్థలం, తొక్కిసలాట ఎలా జరిగిందనే అంశాలపై వివరాలు సేకరించారు. ఇప్పటివరకు సీబీఐ అధికారులు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, గాయపడిన వ్యక్తులు, అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, వెలుచంపురం ప్రాంత నివాసితులు, వ్యాపారులు, అలాగే టీవీకే పార్టీ కార్యదర్శులు సహా పలువురిని విచారించారు.

ఈ ఘటనలో ‘7 గంటల ఆలస్యం’ అనే అంశం కూడా కీలకంగా పరిశీలనలో ఉంది. కార్యక్రమం ప్రారంభం కావాల్సిన సమయం, విజయ్ అక్కడికి చేరుకున్న సమయానికి మధ్య భారీ ఆలస్యం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా ప్రారంభంలో అంచనా వేసిన 10,000 మంది బదులు 30,000 మందికి పైగా జనసందోహం చేరి పరిస్థితి అదుపుతప్పినట్టు దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, స్థానిక పోలీసులు, జిల్లా పరిపాలన మధ్య సమన్వయం సరైన విధంగా జరిగిందా అనే అంశాన్ని కూడా సీబీఐ పరిశీలిస్తోంది. కార్యక్రమ స్థలానికి విజయ్ రాక, అక్కడి నుంచి వెళ్లిన సమయాలు, తొక్కిసలాట జరిగిన విషయం ఆయనకు ఎప్పుడు తెలిసింది వంటి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

‘కరూర్’ కేసులో విజయ్‌కు సీబీఐ నుంచి మళ్లీ పిలుపు - Tholi Paluku