Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
తిరుపతి జిల్లాలో విషాదం... విద్యుత్ కంచె తగిలి రెండు ఏనుగులు మృతి

తిరుపతి జిల్లాలో విషాదం... విద్యుత్ కంచె తగిలి రెండు ఏనుగులు మృతి

Panthagani Anusha
9 మార్చి, 2026

తిరుపతి జిల్లా తలకోన రిజర్వ్ అటవీ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన రెండు ఆసియా ఏనుగులు సాగు భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్ కంచెను తాకి ప్రాణాలు కోల్పోయాయి. సుమారు 12 ఏళ్ల వయసున్న రెండు సబ్-అడల్ట్ ఏనుగులు మృతి చెందడం వన్యప్రాణి ప్రేమికులను తీవ్రంగా కలచివేస్తోంది. సోమవారం ఉదయం భాకరాపేట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఈ ఘటన వెలుగుచూసింది.

జిల్లా అటవీ శాఖాధికారి వి.సాయిబాబా తెలిపిన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా అడవిలోనే సంచరిస్తున్న ఈ ఏనుగులు ఆదివారం రాత్రి ఆహారం కోసం పాత సాయిబులపల్లె మార్గం గుండా అడవి సరిహద్దు దాటి సమీపంలోని పొలాల్లోకి ప్రవేశించాయి. అయితే పంటలను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు ఎవరో అక్రమంగా 33/11 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ నుంచి అల్యూమినియం వైర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి కంచె ఏర్పాటు చేశారు. ఆ తీగలకు ఉన్న హై-వోల్టేజ్ కరెంటు తగలడంతో గజరాజులు అక్కడికక్కడే కుప్పకూలిపోయాయి.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు మృతికి విద్యుత్ షాక్ ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు డి.ఎఫ్.ఓ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిబంధనలు 'ప్రాజెక్ట్ ఎలిఫెంట్' మార్గదర్శకాల ప్రకారం ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. బాధ్యులను గుర్తించి వారిపై కఠినమైన వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా అడవి సరిహద్దు గ్రామాల్లోని రైతులు పొలాలకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని ఇలాంటి చర్యలు వన్యప్రాణులకే కాకుండా అటుగా వెళ్లే మనుషులకు కూడా ప్రాణాపాయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానికులు సహకరించాలని వన్యప్రాణుల కదలికలు గమనిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుపతి జిల్లాలో విషాదం... విద్యుత్ కంచె తగిలి రెండు ఏనుగులు మృతి - Tholi Paluku