
తెలంగాణలో మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఎండల నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. వాతావరణ పరిస్థితుల మార్పుతో మార్చి 9 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సుమారు 36-37 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, హైదరాబాద్‌లో 34-35 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా.
అదేవిధంగా మార్చి 16 నుంచి 23 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశముందని తెలిపారు. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చురుకుగా మారి పలుచోట్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
