
పశ్చిమాసియాపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు: రాహుల్ గాంధీ
పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంట్లో చర్చ జరగకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని, చర్చ జరిగితే ప్రధానమంత్రి నిజరూపం బయటపడుతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ఆరోపించారు. పశ్చిమ ఆసియా పరిస్థితులపై పార్లమెంట్లో చర్చ జరిగితే, అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావానికి ప్రధాని లోనయ్యారనే విషయం బయటపడుతుందని ఆయన అన్నారు. ఈ సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా చమురు ధరలు పెరగవచ్చని రాహుల్ గాంధీ చెప్పారు. పశ్చిమ ఆసియా సంక్షోభం దేశానికి ఎంత నష్టం కలిగిస్తుందనే అంశంపై చర్చ అవసరమని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారు. ప్రధాని అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల దేశానికి పెద్ద నష్టం జరుగుతుంది. ఈ అంశంపై చర్చ చేయడంలో ఏం సమస్య ఉంది? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ జరిగితే ప్రధాని సమాధానం చెప్పలేరని విమర్శించారు. పార్లమెంట్లో చర్చ జరిగితే నిజాలు బయటపడతాయి. అందుకే ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదని అన్నారు.
ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియా పరిస్థితులపై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు చేపట్టడంతో సోమవారం లోక్‌సభ సమావేశాలు గందరగోళం మధ్య వాయిదా పడ్డాయి. సభను మార్చి 10 ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల రెండో దశ మొదటి రోజునే అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో రాహుల్‌గాంధీతో పాటు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొన్నారు.
ఇక రాజ్యసభలో పశ్చిమ ఆసియా పరిస్థితులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. ఇరాన్లో ఉన్న భారతీయులకు ప్రభుత్వం అధికారిక హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అయితే పార్లమెంటరీ నియమాల ప్రకారం అత్యవసర అంశంపై మంత్రి స్వయంగా ప్రకటన చేసిన తర్వాత ప్రత్యేక చర్చకు సాధారణంగా అవకాశం ఉండదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
