
బెంగాల్‌లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించండి: రాజకీయ పార్టీలు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ముందస్తు సన్నాహకాలలో భాగంగా భారత ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళన (ఎస్ఐఆర్) ప్రక్రియపై తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. అధికార ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఓటర్లపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించగా, బీజేపీ ఎన్నికలను తక్కువ దశల్లో నిర్వహించాలని కోరింది. కొల్‌కత్తా తూర్పు ప్రాంతంలోని న్యూ టౌన్‌లో ఉన్న ఓ హోటల్‌లో ఈ సమావేశాలు జరిగాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలోని ఈసీ పూర్తి బెంచ్‌తో టీఎంసీ, బీజేపీ, సీపీఐ(ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమై తమ అభ్యంతరాలు, సూచనలు వెల్లడించారు.
ఎస్‌ఐఆర్‌పై టీఎంసీ ఆందోళన
సమావేశం అనంతరం టీఎంసీ నేతలు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వల్ల సాధారణ ప్రజలు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి, టీఎంసీ నేత చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు తనను గట్టిగా మాట్లాడవద్దని చెప్పారని తెలిపారు. నేను మహిళను. ప్రజల హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడవద్దని ఎందుకు చెబుతున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ఎస్ఐఆర్ అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారి అది ప్రస్తుతం సుప్రీంలో విచారణలో ఉందని ఈసీ చెప్పిందని ఆమె పేర్కొన్నారు. అది కోర్టులో ఉందంటే మమ్మల్ని సమావేశానికి ఎందుకు పిలిచారు? పిలిచిన తర్వాత మా మాట వినాలి కదా అని ఆమె అన్నారు.
ఓటర్ల జాబితాలో పెద్ద మార్పులు
ఫిబ్రవరి 28న విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, గత నవంబర్‌లో ప్రారంభమైన సవరణ ప్రక్రియ తర్వాత సుమారు 63.66 లక్షల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో 8.3 శాతం. దీంతో రాష్ట్ర ఓటర్ల సంఖ్య సుమారు 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు తగ్గింది. అదనంగా 60 లక్షలకుపైగా ఓటర్లను ‘అండర్ అడ్జుడికేషన్’ కేటగిరీలో ఉంచారు. అంటే వారి అర్హతపై చట్టపరమైన పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
చొరబాటుదారులు ఉన్నారనే అభిప్రాయాన్ని బీజేపీ సృష్టించింది... టీఎంసీ మరో ఆరోపణ
కొల్‌కతా మేయర్, టీఎంసీ సీనియర్ నేత ఫిర్హద్ హకీం మాట్లాడుతూ, ప్రజలు తమ పౌరసత్వాన్ని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ రాష్ట్రంలో రోహింగ్యాలు, చొరబాటుదారులు ఉన్నారనే అభిప్రాయాన్ని బీజేపీ సృష్టించింది. అదే ఆధారంగా ఈసీ విధానాలు రూపొందించింది. కానీ రెండు నెలల ప్రక్రియలో అలాంటి ఆధారాలు కనిపించలేదు. బదులుగా భారతీయ పౌరులు వేధింపులకు గురయ్యారని ఆయన ఆరోపించారు. అదనంగా ధృవీకరణ ప్రక్రియ కోసం ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోందని, దీనివల్ల కొందరు అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని కూడా ఆయన ఆరోపించారు.
బీజేపీ డిమాండ్
ఇక బీజేపీ ప్రతినిధి బృందం సమావేశంలో ఎన్నికల భద్రత, పోలింగ్ నిర్వహణపై తమ అభిప్రాయాలు వెల్లడించింది. బీజేపీ నేత జగన్నాథ్ ఛట్టోపాధ్యాయ్ మాట్లాడుతూ ఎన్నికలను ఒకటి, రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని కోరామని తెలిపారు. మూడుకంటే ఎక్కువ దశల్లో పోలింగ్ నిర్వహిస్తే అసాంఘిక శక్తులు ఒక జిల్లాలో నుంచి మరొక జిల్లాకు వెళ్లి ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర భద్రతా బలగాల వినియోగంపై కూడా బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది.
సీపీఎం అభిప్రాయం
ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) మాత్రం ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని కోరింది. బహుళ దశల్లో పోలింగ్ నిర్వహిస్తే అసాంఘిక శక్తులు జిల్లాల మధ్య కదిలి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయపడింది.
ఈసీ హామీ
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చారు. హింసపై ఎన్నికల సంఘానికి సున్నా సహనం ఉంది. స్వేచ్ఛాయుత, పారదర్శక, శాంతియుత ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, పక్షపాతం లేకుండా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితాలో చేర్పు, తొలగింపు లేదా సవరణల కోసం చట్టపరమైన నిబంధనల ప్రకారం అభ్యంతరాలు, అభ్యర్థనలు దాఖలు చేసే అవకాశం ఉన్నదని కూడా ఆయన స్పష్టం చేశారు.
