
మార్చి 13 నుంచి ఓటీటీలోకి ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి’
సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. చాలా రోజులుగా ఈ సినిమా డిజిటల్ విడుదలపై వార్తలు వస్తున్నప్పటికీ, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక ‘ జీ5’ అధికారిక ప్రకటనతో స్పష్టత ఇచ్చింది. ఈ చిత్రం మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.
దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయాతి కథానాయికలుగా నటించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రేసులో విడుదలై మంచి టాక్‌ను అందుకుంది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.30 కోట్ల వరకూ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రానుండటంతో డిజిటల్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు
కథ ఎలా కొనసాగిందంటే….?
ఈ సినిమాలో రామ్ సత్యనారాయణ అనే వైన్‌యార్డ్ యజమాని పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఆయన భార్య బాలామణిగా డింపుల్ హయాతి నటించారు. భర్తపై అపారమైన ప్రేమ, నమ్మకం కలిగిన భార్యగా ఆమె పాత్ర కథలో కీలకం.
వ్యాపార పనిమీద స్పెయిన్ వెళ్లిన రామ్ అక్కడ కంపెనీ ఎండీ మానస శెట్టితో పరిచయం పెంచుకుంటాడు. తాను ఇప్పటికే పెళ్లైన వ్యక్తిననే విషయాన్ని దాచిపెట్టి ‘సత్య’ పేరుతో ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రామ్ తన భార్య ప్రేమను చూస్తూ అపరాధ భావనతో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.
కానీ కథ అక్కడితో ముగియదు. స్పెయిన్‌లో పరిచయమైన మానస ఇండియాకు రావడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయి. ఒకవైపు భార్య, మరోవైపు ప్రేయసి మధ్య చిక్కుకున్న రామ్ తన సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడు? అతని రహస్యం బయటపడుతుందా? అనే ఆసక్తికర మలుపులతో సినిమా సాగుతుంది. కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన పొందింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
