
సంభాషణే మార్గం.. భారతీయుల భద్రతే ప్రాధాన్యం: జైశంకర్
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గించి సంభాషణ, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని భారత్ కోరుకుంటుందని విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న యునెటైడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై సైనిక దాడులు చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంతో ఏర్పడిన సంక్షోభంపై ఆయన రాజ్యసభలో స్వయంగా ప్రకటన చేశారు.
భారత్ శాంతికి అనుకూలంగా ఉంది. ఉద్రిక్తతలు తగ్గించి సంభాషణ, దౌత్య మార్గాలకు తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. పౌరుల భద్రతను కాపాడటం అత్యంత ముఖ్యమైందని జైశంకర్ తెలిపారు. పశ్చిమ ఆసియాలో ఉన్న భారతీయుల భద్రతతో పాటు దేశ ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రత, వాణిజ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలని ఆయన చెప్పారు. ఈ సంక్షోభం ప్రారంభమైన వెంటనే భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి అన్ని పక్షాలు అత్యంత నియంత్రణ పాటించాలని, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయకూడదని కోరిందని ఆయన పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం సంభాషణ, దౌత్యం ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూనే ఉందని మంత్రి తెలిపారు.
ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన తాజా ఘర్షణల్లో ఒవైపు అమెరికా, ఇజ్రాయెల్ కాగా మరోవైపు ఇరాన్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘర్షణల్లో పలు గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో పాటు భారీ ప్రాణనష్టం కూడా సంభవించిందన్నారు.
మార్చి 1న ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు జైశంకర్ చెప్పారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక కార్యకలాపాలు, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతపై చర్చ జరిగినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో సుమారు ఒక కోటి భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారని, అలాగే ఇరాన్‌లో విద్యా లేదా ఉద్యోగాల కోసం కొంతమంది భారతీయులు ఉన్నారని మంత్రి తెలిపారు. అందువల్ల ఆ ప్రాంతంలో స్థిరత్వం భారత్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. ఇంధన అవసరాలు, వాణిజ్యంలో కూడా గల్ఫ్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోందని, భారత్‌కు అక్కడి దేశాలతో సుమారు 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉందని పేర్కొన్నారు.
భారతీయులను అప్పటి నుంచే హెచ్చరిస్తున్నాం
వాణిజ్య నౌకలపై దాడులు జరగడం వల్ల భారతీయ సముద్రయాన కార్మికులు కూడా ప్రభావితమయ్యారని, కొంతమంది గాయపడగా ఒక భారతీయ నావికుడు ఇప్పటికీ కనిపించకుండా పోయాడని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జనవరి నుంచే పలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసిందని మంత్రి చెప్పారు. ఇరాన్‌కు అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని భారతీయులకు సూచించామని తెలిపారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగిస్తూ భద్రతా సూచనలు పాటించాలని సూచించినట్లు తెలిపారు. కొంతమంది భారతీయులను ఇతర దేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి దాదాపు 67,000 మంది భారతీయులు తిరిగి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అవసరానికి అనుగుణంగా అదనపు వాణిజ్య విమానాలు, ఇతర ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, అలాగే భారతీయ సముద్రయాన కార్మికులకు సహాయం చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రధాని పలు ప్రాంతీయ దేశాల నాయకులతో కూడా మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. యూఏఈ, ఖతర్, సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, ఇజ్రాయెల్ నాయకులు భారతీయుల భద్రతకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా భారత్ యూఎస్, ఇరాన్‌తో కూడా దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగిస్తోందని చెప్పారు. తాను కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫిబ్రవరి 28, మార్చి 5 తేదీల్లో మాట్లాడినట్లు వెల్లడించారు. మానవతా దృష్ట్యా ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ లావన్ నౌకకు మార్చి 4న కొచ్చిన్ పోర్టులో నిలిచేందుకు భారత్ అనుమతి ఇచ్చినట్లు కూడా జైశంకర్ తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ దేశ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
