
‘స్వేచ్ఛ’ ఇచ్చే నిజమైన ప్రేమ కావాలి ….రష్మిక ట్వీట్
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ రిలేషన్‌షిప్‌పై ఎన్నాళ్లుగానో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహం అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించబడింది.
పెళ్లి తర్వాత ఈ స్టార్ కపుల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక నెటిజన్ వీరి ప్రేమ ప్రయాణం, కెరీర్ వివాహం గురించి రాసిన హృద్యమైన ఆర్టికల్ రష్మికను భావోద్వేగానికి గురి చేసింది. ఆ పోస్ట్‌లో ‘నిజమైన ప్రేమకు నిదర్శనం ఒకరినొకరు గౌరవించుకోవడమే’ అని పేర్కొనడం ఆమెను ఎంతో కదిలించింది.
ట్వీట్ లో రష్మిక స్పందన :
‘నా గురించి చాలామంది చాలా రాశారు. కానీ ఈ నోట్ చదువుతుంటే కలిగిన భావన అద్భుతం. చెప్పాలని చాలా ఉంది కానీ మాటలు రావడం లేదు. ప్రస్తుతం నేను నా సొంత ప్రపంచాన్ని వెతుక్కుంటున్న ప్రయాణంలో ఉన్నాను. దాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ఇక ప్రేమ గురించి ఆమె చెప్పిన సందేశం అభిమానులను ఆకట్టుకుంది. ‘ప్రేమ అంటే ఒకరిని బంధించడం కాదు. ఎదగడానికి ప్రోత్సహిస్తూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ప్రేమను కనుగొనండి” అని రష్మిక అన్నారు.
ఇదిలా ఉంటే, పెళ్లి తర్వాత ఈ జంట మరోసారి పెద్ద తెరపై కలిసి కనిపించబోతోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ అనే ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో నటిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’ పాత్రలో కనిపించనున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్‌కు మంచి స్పందన లభించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత రియల్ లైఫ్ కపుల్‌గా మారిన ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
