
హర్మూజ్ జలసంధి: ప్రపంచ ఇంధన రవాణాను శాసిస్తున్న కీలక మార్గం
ప్రస్తుత పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూసివేత అంశం మళ్లీ అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు లేదా ప్రాంతీయ యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అయినప్పుడు, ఇరాన్ తరచుగా ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తూ వస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో, తమ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ యుద్దం కొనసాగించినా, తన చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలు చేపట్టినా, హర్మూజ్ జలసంధిని మూసివేయడం కూడా ఒక ఎంపికగా భావించవచ్చని ఇరాన్ ముందే ప్రపంచానికి సంకేతాలు ఇచ్చింది.
అన్నట్టుగానే ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై జరిగిన తర్వాత, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ కీలక సముద్ర మార్గాన్ని నియంత్రణలోకి తీసుకుని, ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తే నౌకలకుప్రమాదకరమని హెచ్చరించింది. ఈ హెచ్చరికల తర్వాత అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను ఆ మార్గం ద్వారా పంపడం నిలిపివేశాయి. ఫలితంగా జలసంధి గుండా జరిగే వాణిజ్య రవాణా దాదాపు నిలిచిపోయింది.
గత కొన్ని రోజులుగా సముద్ర రవాణా 80శాతం వరకు తగ్గిపోయినట్లు అంతర్జాతీయ వాణిజ్య నివేదికలు తెలిపాయి. అనేక ట్యాంకర్లు గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయాయి. మరోపక్క విశాఖ పోర్ట్ నుండి బయలుదేరి వెళ్ళిన అనేక సరుకు రవాణా నౌకలు సముద్రంలో వెనుతిరిగి తమ యధా స్థానానికి బయలుదేరాయి. ఇలా వాణిజ్య నౌకలు తిరిగి వెనెక్కి రావడం చరిత్రలో ఇదే తొలిసారి అని పోర్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాఉంటే తిరిగి వచ్చిన రవాణా సరుకు మొత్తం ఓడ రేవుల్లో నిల్వ ఉంచడం సాద్యం కాదని ప్రభుత్వం భావిస్తుంది. దీనితో భారత వాణిజ్యం పెద్దఎత్తున నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ యుద్ద పరిణామాలతో భారత్ లోనే కాదు, ప్రపంచ చమురు మార్కెట్లలో కూడా కల్లోలం నెలకొంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20శాతం వరకు రవాణా జరుగుతుండటంతో, రవాణా ఆగిపోవడం చమురు ధరలను పెంచే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చినట్టు సమాచారం. అలాగే అనేక నౌకలకు బీమా కంపెనీలు ‘వార్ రిస్క్’ కవరేజీ నిలిపివేయడంతో సముద్ర వాణిజ్యం మరింత మందగించింది. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య వ్యవస్థలపై పెద్ద ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇరాన్ అధికారికంగా జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు కొన్నిసార్లు ఖండించినప్పటికీ, భద్రతా ప్రమాదాల కారణంగా అనేక నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగించడం మానేయడంతో ప్రస్తుతం ఇది ‘డీ-ఫాక్టో మూసివేత’ పరిస్థితిలో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సైనిక నిపుణుల అబిప్రాయం ప్రకారం, ఇరాన్ సముద్ర మైన్లు, యాంటీ-షిప్ క్షిపణులు, డ్రోన్లు, వేగవంతమైన స్పీడ్ బోట్లు వంటి ఆయుధాలను ఉపయోగించి తాత్కాలికంగా సముద్ర రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, జలసంధి వెడల్పు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇది కొంత ప్రయోజనం కలిగిస్తున్నప్పటికి ఇరాన్ పూర్తిగా ఈ మార్గాన్ని మూసివేస్తే, అది అమెరికా, పశ్చిమ దేశాల నౌకాదళాలతో నేరుగా పెద్ద స్థాయి సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్న ఈ హర్మూజ్ జలసంధి గురించిన మరిన్ని విశేషాలు చూద్దాం …
పశ్చిమ ఆసియాలోని పర్షియన్ సింధుశాఖను ఒమన్ సింధుశాఖతో కలుపుతూ మహాసముద్రాలకు దారి తీసే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ జలసంధి ఉత్తర భాగంలో ఇరాన్ ఉండగా, దక్షిణ భాగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశానికి చెందిన ముసందమ్ ప్రాంతం ఉన్నాయి. పర్షియన్ సింధుశాఖలోని చమురు సమృద్ధిగా ఉన్న దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు ఇంధన సరఫరా జరగడానికి ఈ మార్గమే ప్రధాన దారి. అందువల్ల దీనిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన “చోక్ పాయింట్” అని నిపుణులు పేర్కొంటారు.
హర్మూజ్ జలసంధి సుమారు 167 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండగా, వెడల్పు కొన్ని చోట్ల 52 కిలోమీటర్లు, మరికొన్ని చోట్ల కేవలం 21 కిలోమీటర్లకు మాత్రమే ఉంటుంది. ఇంత సన్నని సముద్ర మార్గం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్లు ప్రయాణించడం వల్ల ఇది అంతర్జాతీయ సముద్ర రవాణాలో అత్యంత కీలక ప్రాంతంగా మారింది. పర్షియన్ సింధుశాఖలోని సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు తమ చమురు ఎగుమతుల కోసం ప్రధానంగా ఈ జలసంధిపైనే ఆధారపడుతున్నాయి.
ప్రపంచ చమురు రవాణాలో హర్మూజ్ జలసంధి పాత్ర అత్యంత కీలకమైనది. రోజుకు సగటున సుమారు 2 కోట్ల బారెళ్లకు పైగా ముడి చమురు ఈ మార్గం గుండా ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. ఇది ప్రపంచ మొత్తం చమురు వినియోగంలో దాదాపు ఐదవ వంతు. అంతేకాకుండా ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ ) సరఫరాలో కూడా ఎక్కువ శాతం ఈ మార్గం ద్వారానే రవాణా జరుగుతుంది. ఖతార్ వంటి దేశాలు తమ సహజ వాయువు ఎగుమతులకు పూర్తిగా ఈ మార్గంపైనే ఆధారపడుతున్నాయి.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వారి 2007 నివేదిక ప్రకారం, పర్షియన్ సింధుశాఖ నుండి ప్రతిరోజూ 1.7 కోట్ల బారెళ్ళు జలసంధి ద్వారా రవాణా అవుతోందని పేర్కొంది. ఇది మొత్తం ప్రపంచ-వాణిజ్య చమురులో దాదాపు 40శాతం.
యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, 2011 లో పర్షియన్ సింధుశాఖ నుండి రోజుకు సగటున 14 ట్యాంకర్లు 1.7 కోట్ల బ్యారెళ్ళ ముడి చమురు తీసుకుని జలసంధి గుండా ప్రయాణించాయి. ఇది ప్రపంచంలోని సముద్రపు చమురు రవాణాలో 35శాతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారమయ్యే చమురులో ఇది 20శాతం. ఈ క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో 85శాతం కంటే ఎక్కువ ఆసియా మార్కెట్లకు వెళ్లాయని, జపాన్, భారతదేశం, దక్షిణ కొరియా, చైనాలు అతిపెద్ద గమ్యస్థానాలనీ ఆ నివేదిక పేర్కొంది. ఒక్క 2018 లోనే, రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ళు జలసంధి గుండా వెళ్ళాయి.అంటే 2019 సెప్టెంబరు ధరల ప్రకారం ఇది రోజుకు 1170 కోట్లడాలర్ల విలువైన చమురు అన్న మాట.
ఈ మార్గం గుండా వెళ్లే చమురు సరఫరాలో ఎక్కువ భాగం ఆసియా దేశాలకు చేరుతుంది. చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రధాన వినియోగదారులు. ముఖ్యంగా భారతదేశం దిగుమతి చేసుకునే చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. అందువల్ల హర్మూజ్ జలసంధిలో ఏవైనా ఉద్రిక్తతలు లేదా రవాణా అంతరాయాలు ఏర్పడితే భారతదేశం సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ సముద్ర మార్గం అయినప్పటికీ, ఇది ఇరాన్, ఒమన్ దేశాల ప్రాదేశిక జలాల గుండా వెళ్తుంది. అందువల్ల నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంలో పేర్కొన్న ట్రాన్సిట్ పాసేజ్ నిబంధనలను అనుసరిస్తాయి. అయితే ఇరాన్, ఒమన్ కొన్ని సందర్భాల్లో విదేశీ యుద్ధనౌకలు తమ ప్రాదేశిక జలాల్లో ప్రయాణించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొంటూ ప్రకటనలు చేశాయి. అమెరికా వంటి కొన్ని దేశాలు ఈ వాదనలను అంగీకరించకపోవడం వల్ల అప్పుడప్పుడు వివాదాలు చోటుచేసుకుంటాయి.
ఈ జలసంధి ప్రాంతం గతంలో అనేక సైనిక సంఘటనలకు కూడా వేదికగా నిలిచింది. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో “ట్యాంకర్ యుద్ధం” అనే దశ ప్రారంభమైంది. ఈ సమయంలో ఇరాక్, ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లపై దాడులు చేయడంతో సముద్ర రవాణా ప్రమాదంలో పడింది. అయినప్పటికీ ఇరాన్ పూర్తిగా జలసంధిని మూసివేయలేదు. ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని తెరిచే ఉంచింది.
1988లో అమెరికా, ఇరాన్ మధ్య హర్మూజ్ ప్రాంతంలో జరిగిన “ఆపరేషన్ ప్రేయింగ్ మాంటిస్” కూడా ముఖ్యమైన సంఘటనగా గుర్తించబడింది. అమెరికా నౌక యుఎస్ఎస్ శామ్యూల్ బి. రాబర్ట్స్ నౌకపై, ఇరాన్ మందుపాతర దాడి చేసినందుకు ప్రతీకారంగా అమెరికా నౌకాదళం ఈ దాడిని ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు చెందిన అనేక నౌకలు ధ్వంసమయ్యాయి.
అదే సంవత్సరంలో మరో విషాద ఘటన కూడా చోటుచేసుకుంది. అమెరికా నౌక యుఎస్ఎస్ విన్సెన్స్ పొరపాటున ఇరాన్ ఎయిర్ 655 అనే ప్రయాణికుల విమానాన్ని క్షిపణితో కూల్చివేసింది. అమెరికా ఈ విమానాన్ని జెట్ ఫైటర్ అని పొరబడి ఈ దాడి చేసింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 290 మంది మరణించారు. ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది.
2000ల తర్వాత కూడా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2007–2008లో ఇరాన్ స్పీడ్ బోట్లు అమెరికా యుద్ధనౌకలకు దగ్గరగా రావడం వల్ల రెండు దేశాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అమెరికా అధికారులు ఇరాన్ తమ నౌకలను వేధించిందని ఆరోపించగా, ఇరాన్ ఆ ఆరోపణలను ఖండించింది.
అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పుడు ఇరాన్ తరచూ హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా 2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి వైదొలిగి ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ అధికారులు “మా చమురు ఎగుమతులు ఆపేస్తే ఇతర దేశాల చమురు కూడా ఈ జలసంధి గుండా వెళ్లదు” అని హెచ్చరించారు. అయితే ఇప్పటివరకు ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసివేయలేదు.
సైనిక నిపుణుల అంచనా ప్రకారం, ఇరాన్‌కు కొంతకాలం పాటు జలసంధిలో సముద్ర రవాణాను అడ్డుకునే సామర్థ్యం ఉంది. సముద్ర మైన్లు, యాంటీ-షిప్ క్షిపణులు, స్పీడ్ బోట్లు వంటి ఆయుధాలను ఉపయోగించి తాత్కాలికంగా ట్రాఫిక్‌ను అడ్డుకోవచ్చు. అయితే అమెరికా, మిత్ర దేశాల నౌకాదళాలు కలిసి పనిచేస్తే ఈ మార్గాన్ని మళ్లీ తెరవడం సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
హర్మూజ్ జలసంధిపై ఆధారపడకుండా ఉండేందుకు కొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేస్తున్నాయి. సౌదీ అరేబియా ఈస్ట్–వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ ద్వారా తన చమురును ఎర్ర సముద్రంలోని ఓడరేవులకు పంపే ఏర్పాట్లు చేసింది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి నుండి ఫుజైరా వరకు హబ్షాన్–ఫుజైరా పైప్‌లైన్ నిర్మించింది. ఈ పైప్‌లైన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తప్పిస్తుంది.
అయితే ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఇంకా హర్మూజ్ జలసంధిపైనే ఆధారపడుతోంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఏవైనా రాజకీయ లేదా సైనిక ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమవడం వంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది.
మొత్తానికి హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన సముద్ర మార్గం. చిన్నదైనప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా పెద్దది. అందుకే ఈ ప్రాంతంలో శాంతి, భద్రత కొనసాగడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఉన్న యుద్దవాతావరణంతో ఇరాన్ ఈ జలసంధిని మూసివేసి ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలు విసిరింది.
ప్రస్తుతం, హర్మూజ్ మార్గం ప్రమాదకరంగా మారడంతో అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ ట్యాంకర్లను ఆ ప్రాంతం గుండా పంపడాన్ని తగ్గిస్తున్నాయి. దీనివల్ల చమురు మాత్రమే కాకుండా గ్యాస్, ఇతర సరుకు రవాణా కూడా ఆలస్యమవుతోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం, కొన్ని దేశాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు అధికంగా పెరగడం,స్టాక్ మార్కెట్ల పతనం, వంటి ప్రభావాలు కనిపించి అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నా భిన్నం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
